తమిళనాడు సిఎంపై హైకోర్టులో కేసువేసిన శశికళ

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైలుశిక్ష అనుభవించి చెన్నై తిరిగివచ్చిన శశికళ ఒకటి ఊహిస్తే ఇంకోటి జరిగింది. అధికార అన్నాడీఎంకె పార్టీలో ముగ్గురు మంత్రులు, 15-20 మంది ఎమ్మెల్యేలు తనతో చేతులు కలుపుతారని ఆశిస్తే ఒక్కరూ కూడా రాకపోవడంతో ఆమె షాక్ అయ్యుండవచ్చు. 

ఆమె చెన్నైలో అడుగుపెట్టగానే అన్నాడీఎంకె పార్టీని నిలువునా చీల్చి ప్రభుత్వాన్ని కూలద్రోస్తారని ముందే ఊహించిన తమిళనాడు సిఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ గట్టిగా కట్టడిచేసి ఉంచారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని శశికళ గురువారం మద్రాస్ హైకోర్టులో సిఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలపై ఓ కేసు వేశారు. ‘అన్నాడీఎంకె పార్టీకి అసలైన యజమాని, హక్కుదారు నేనేనని కనుక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తనకు అప్పగించవలసిందిగా వారిరువురినీ ఆదేశించాలని’ కోరుతూ ఆమె పిటిషన్‌ వేశారు. తనను కుట్రపూరితంగా ఆ పదవిలో నుంచి తప్పించినందుకు వారి నుంచి నష్టపరిహారం కూడా  ఇప్పించాలని ఆమె పిటిషన్‌ ద్వారా కోరారు. ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు మార్చి 15న దానిపై విచారణ చేపడతామని తెలియజేసింది. అయితే పార్టీలో సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ సిఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం చెప్పుచేతలలో ఉంటూ వారికి విధేయంగా ఉన్నప్పుడు న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో కలుగజేసుకోకపోవచ్చు.