భారత్‌తో ఘర్షణ పడి చైనా సాధించిందేమిటి?

గత 9 నెలలుగా తూర్పు లద్దాక్‌లో భారత్‌-చైనా సేనలు అనేకసార్లు ముఖాముఖి తలపడ్డాయి. మొదటిసారి గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలలో భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు మరణించగా, 45 మందికి పైగా చైనా జవాన్లు మరణించినట్లు రష్యా ఏజన్సీ టాస్ ప్రకటించింది. అప్పటి నుంచే చైనా పట్ల భారత్‌ చాలా కటినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. చైనాకు చెందిన పలు మొబైల్ యాప్‌లపై నిషేదం విధించింది. చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది. 

సరిహద్దులవద్ద భారీగా సైనికులను, ఆయుధాలను, చివరికి యుద్ధవిమానాలు, యుద్ధ  హెలికాప్టర్లు,  ట్యాంకర్లు మోహరించి చైనాను అడుగు ముందుకువేయకుండా అడ్డుకొంది. ఓ పక్క భారత్‌తో శాంతిచర్చలు జరుపుతూనే మరోపక్క గుట్టుగా భారత్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చి సరిహద్దులను ఆక్రమించేందుకు చైనా కుటిల ప్రయత్నాలు చేసింది. కానీ భారత్‌ సంయమనం కోల్పోకుండా ఓ పక్క శాంతిచర్చలు కొనసాగిస్తూనే చైనా సేనలను నిలువరించింది. ఈవిదంగా సుమారు 9 నెలలు గడిచిన తరువాత గానీ చైనాకు జ్ఞానోదయం కలుగలేదు. దాంతో ఇప్పుడు చైనా తోకముడిచి సైన్యాన్ని, ఆయుధాలను అన్నిటినీ ఉపసంహరించుకొంటోంది. కనుక భారత్‌ సేనల ఉపసంహరణ కూడా మొదలైంది. 

ఈ సందర్భంగా ఉత్తర భారత ఆర్మీ లెఫ్టినెంట్ కమాండర్ జనరల్ వైకే జోషి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “గత ఏడాది ఆగస్ట్ 31వ తేదీన చైనాతో దాదాపు యుద్ధం మొదలై ఉండేది. అందుకు పూర్తిసిద్దంగా ఉన్న భారత్‌ సేనలు అప్పుడు చాలా సంయమనం పాటించడంతో భారత్‌-చైనా యుద్ధం తప్పిపోయింది. భారత్‌లోకి చొచ్చుకురావాలని ప్రయత్నించి ప్రపంచదేశాలలో చెడ్డపేరు సంపాదించుకోవడం తప్ప ఈ తొమ్మిది నెలల్లో చైనా సాధించింది ఏమీ లేదు. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వితే ఏమవుతుందో అర్దమైంది కనుక చైనా మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి దుసాహసానికి పూనుకోదని భావిస్తున్నాము. ఈ సరిహద్దు సంఘర్షణలలో భారత్‌ జవాన్ల ధైర్యసాహసాలు యావత్ ప్రపంచానికి తెలిశాయి,” అని అన్నారు.