
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కనుక తమిళిసై సౌందరరాజన్ ఈరోజు పుదుచ్చేరి చేరుకొని లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమె చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
గత రెండున్నరేళ్ళుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీకి, పుదుచ్చేరి ప్రభుత్వానికి మద్య విభేధాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈనెల 10న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీలను కలిసి ఆమెను తప్పించవలసిందిగా కోరారు. ఆయన అభ్యర్ధన మేరకు కేంద్రప్రభుత్వం కిరణ్ బేడీని తప్పించి ఆమె స్థానంలో తమిళిసై సౌందరరాజన్‌కి పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కనుక ఇకపై ఆమె తెలంగాణ, పుదుచ్చేరిలకు గవర్నర్‌గా వ్యవహరించనున్నారు.