
వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసుపై నేడు విచారణ జరిపిన హైకోర్టు, తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు అభ్యర్ధన మేరకు ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈరోజు జరిగిన విచారణలో ఈ కేసు వేసిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదిస్తూ ‘జర్మనీ పౌరసత్వం కలిగిన చెన్నమనేని తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎమ్మెల్యేగా కొనసాగడం రాజ్యాంగ విరుద్దమే కనుక ఆయన పౌరసత్వాన్ని తక్షణం రద్దు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని వాదించారు. కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది కూడా చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని మరోసారి తేల్చి చెప్పారు.
ఈ కేసులో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం కూడా కలుగజేసుకొంది. ఈ కేసుతో కేంద్రప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని, రాష్ట్ర ప్రభుత్వాని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని, చెన్నమనేని అనేక ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారని, కనుక ఈ కేసులో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. మూడు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈకేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఆరోజున ఈ కేసుపై తీర్పు వెలువరిస్తామని కనుక ఈ కేసుతో సంబందం ఉన్నవారందరూ అన్ని సాక్ష్యాధారాలతో ఆరోజు కోర్టుకు హాజరుకావాలని సూచించింది.