
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి, వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికాలం వచ్చేనెల 29వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
ఈరోజు నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నామినేషన్ల ప్రక్రియలో ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకుంటారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి23వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 24వ తేదీన నామినేషన్లను పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థుల పేర్లను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 17వ తేదీన నిర్వహిస్తారు.
ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలో 80 ఏళ్ల వయసు పైబడిన వారు, దివ్యాంగులు, కరోనా అనుమానితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పైన తెలిపిన వారు సంబంధిత సర్టిఫికెట్లను దగ్గర ఉంచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.