ఏపీలో కూడా ఎన్నికల హడావుడి షురూ

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తరువాత నాగార్జునసాగర్ ఉపఎన్నికలు, మద్యలో మునిసిపల్ ఎన్నికలు వరుసగా సాగబోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి ముగిసేలోగానే ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ప్రకటించేసారు. దీంతో ఏపీలో కూడా రాజకీయవాతావరణం ఇంకా వేడెక్కిపోయింది. 

ఏపీలోని 12 నగరపాలక సంస్థలు, 140 పురపాలక సంస్థలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే వాటిలో కొన్నిటికి గత ఏడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా కరోనా కారణంగా మద్యలోనే వాటిని నిలిపివేసారు. వాటిని ఏ దశలో నిలిపివేశారో అక్కడి నుంచే మళ్ళీ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఆ ప్రకారం మార్చి 2వ తేదీ నుంచి 3వరకు నామినేషన్ల ఉపసంహరణతో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ఎన్నికల షెడ్యూల్ ఈవిదంగా ఉంది:  

మార్చి 2: ఎన్నికల ప్రక్రియ పునః ప్రారంభం

మార్చి 3: నామినేషన్ల ఉపసంహరణ

మార్చి 3: అభ్యర్థుల జాబితా ప్రకటన

మార్చి 10: పోలింగ్‌

మార్చి 13: అవసరమైన చోట్ల రీపోలింగ్‌

మార్చి 14: ఓట్ల లెక్కింపు, ఫలితాలు.