ఎన్నికల హామీలు ఎప్పుడు అమలుచేస్తారు? ఉత్తమ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అధికార పార్టీ, బిజెపిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే పూర్తి చేయాలని అధికారపార్టీని కోరారు. గతవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి నిరుద్యోగులకు భృతి ఇస్తానని మీడియా ముఖంగా ప్రకటించారు, కానీ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడంలేదని అన్నారు. వీలైనంత త్వరగా నిరుద్యోగులకు భృతి ప్రకటించాలన్నారు.

అలాగే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులను తేవడంలో విఫలం అయ్యారు అని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు భృతిని చెల్లిస్తామని అన్నారు. కొంతమంది నేతలకు రాజకీయాలంటే వ్యాపారంగా భావిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అన్నారు. కేంద్రం ప్రభుత్వం భద్రాచలం  రామాలయ  భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చూస్తున్నదని ఉత్తమ్ అన్నారు.