
బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఈరోజు ఫేస్బుక్ వేదికగా మళ్ళీ సిఎం కేసీఆర్పై తీవ్ర విమర్శల చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో హిందువులను విమర్శించడం వల్లనే అక్కడి ప్రజలు బీజేపీకి పట్టంకట్టారని విజయశాంతి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలను కించపరుస్తూ మాట్లాడటం పరిపాటిగా మారిపోయిందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వివిద సందర్భాలలో సిఎం కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టే విదంగా, కించపరిచే విదంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.
సిఎం కేసీఆర్ మాటలను ప్రజలు తేలికగా తీసుకోకుండా జిహెచ్ఎంసి, దుబ్బాక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా కూడా మారలేదని అన్నారు. మొన్న జరిగిన హాలియా బహిరంగసభలో సీఎం కేసీఆర్ స్త్రీలపట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను విజయశాంతి తీవ్రంగా ఖండించారు. అటువంటి వ్యక్తి టిఆర్ఎస్ కార్పోరేటర్లకు ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ముందు సిఎం కేసీఆర్ ప్రజలతో ఏవిధంగా మాట్లాడాలో సరైన శిక్షణ తీసుకోవాలని విజయశాంతి హితవుపలికారు. సీఎంకు తగ్గట్టు మంత్రులు కూడా ప్రజలను రెచ్చగొట్టే, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు.
సిఎం కేసీఆర్ ప్రజలను, ప్రతిపక్ష నేతలను ఇష్టారీతిగా విమర్శించడం తగునా? అని విజయశాంతి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే మాత్రం మంత్రులు, చోటామోటా నాయకులు విడతల వారీగా ఎదురుదాడి చేస్తుంటారని అన్నారు.
ప్రజలను కించపరిచేలా... రెచ్చగొట్టేలా మాట్లాడడం బిజెపి చరిత్రలోనే లేదని అన్నారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే రాచరికంలో ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు.