
మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికలో మజ్లీస్ పార్టీ టిఆర్ఎస్ అభ్యర్ధులకు బేషరతుగా మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్, బిజెపి నేతలు ఆ రెండు పార్టీల మద్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని... అవి ప్రజలను మోసం చేసాయంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాటిపై స్పందిస్తూ, “మజ్లీస్ పార్టీ మద్దతులేకుండానే మా అభ్యర్ధులను గెలిపించుకోగల బలం మాకున్నప్పుడు మేము ఆ పార్టీ మద్దతు ఎందుకు కోరుతాము? కానీ వారంతటవారే మాకు మద్దతు ఇస్తే దానికి మమ్మల్ని నిందించడం దేనికి?మేము మజ్లీస్ పార్టీకి డెప్యూటీ మేయర్ పదవి ఆఫర్ చేశామనడం కూడా సరికాదు. మా పార్టీలోనే దానికోసం అనేకమంది పోటీ పడుతున్నప్పుడు మజ్లీస్‌కు ఎందుకు ఆఫర్ చేస్తాం? మేయర్, డెప్యూటీ మేయర్ అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు తగినంత బలం లేకపోయినా బిజెపి ఎందుకు మాతో పోటీ పడింది?
రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకురాలేరు కానీ ప్రజలమద్య కులమతాల చిచ్చు పెట్టి రాజకీయాలబ్ది పొందాలనుకొంటారు. ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులను తెస్తే వారిని ప్రజలు కూడా గౌరవిస్తారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. బీసీలు, మైనార్టీలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ మేయర్, డెప్యూటీ మేయర్ పదవులకు మహిళలకు కట్టబెట్టి గౌరవించింది,” అని అన్నారు.