పదవిపై ఆశ లేదు...పార్టీ కోసమే పోటీ: జానారెడ్డి

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు జానారెడ్డి ఈరోజు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ఈ పదవికి ఆశపడి పోటీ చేయడం లేదు. ఎనిమిదిసార్లు గెలిచిన నాకు మరోసారి పోటీ చేయవలసిన అవసరమే లేదు. అలాగని సిఎం కేసీఆర్‌లాగ నేను ఎమ్మెల్యే పదవి గురించి చులకనగా మాట్లాడను. శాసనసభలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి నా అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితులలో నేను పోటీ చేయడం తప్పనిసరి అని మా పార్టీ అధిష్టానం సూచన మేరకు నేను పోటీ చేస్తున్నాను. ఆనాడు మా ప్రభుత్వ హయంలో నెలకొల్పిన కంపెనీలే నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తున్నాయి. టిఆర్ఎస్‌ నేతలు ఇప్పుడు ఉచిత విద్యుత్ గురించి గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ ఆ పని మా ప్రభుత్వం ఎప్పుడో చేసి చూపించింది. రాష్ట్రంలో, దేశంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే,” అని అన్నారు. 

మొన్న హాలియా బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే మూలకారణం అంటూ నిప్పులు చెరిగారు. కానీ జానారెడ్డి తమ ప్రభుత్వ హయాంలోనే దేశంలోనూ తెలంగాణలోనూ అభివృద్ధి జరిగిందని చెప్పుతున్నారు. జానారెడ్డికి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. కానీ సహజంగా మృధుస్వభావి, ఆచితూచి చాలా హుందాగా మాట్లాడే వ్యక్తి కావడంతో టిఆర్ఎస్‌ విమర్శలను అదే స్థాయిలో ధీటుగా తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పవచ్చు. మరి ఈ ఎన్నికలలో గెలిచి తీరాలని చాలా పట్టుదలగా ఉన్న టిఆర్ఎస్‌,  బిజెపిలను జానారెడ్డి ఏవిధంగా ఎదుర్కొంటారో....చూడాలి.