
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ రాకుండా కేంద్రమే అడ్డుకున్నదని అన్నారు. రాష్ట్రంలో డ్రైపోర్ట్ కోసం అనువైన స్థలాన్ని కేంద్రానికి చూపిన కూడా నిధులను కేటాయించడంలో ఆలస్యం చేస్తోందని అన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసత్య ప్రచారాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. హైదరాబాద్ త్వరలోనే అంతర్జాతీయ ఫార్మాహబ్‌గా మారనున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగా ఫార్మాసిటీ కోసం 10,500 ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు. కాబట్టి ఫార్మాసిటీ కూడా కేంద్రం నిధులను కేటాయించాలని బడుగుల లింగయ్య యాదవ్ విజ్ఞప్తి చేసారు.
దక్షిణాది మహానగరాలైన హైదరాబాద్, బెంగళూరు మద్య పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక వినతులు సమర్పించుకొన్నప్పటికీ అనుమతులు మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్కు కోసం 3,500 ఎకరాల భూమిని సిద్ధం చేసిందని, కేంద్రప్రభుత్వం నిధులు, అనుమతులు ఇవ్వడమే తరువాయి అన్నారు. వీలైనంత త్వరగా వీటన్నింటికీ నిధులను కేటాయించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి కేవలం ఆరున్నర సంవత్సరాలు మాత్రమే అయినా అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.