అవును కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలోనే ఉంది: బండి

హైదరాబాద్‌ మేయర్‌, డెప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా మజ్లీస్‌ పార్టీ సభ్యులు టిఆర్ఎస్‌కు బేషరతుగా మద్దతు పలకడంపై ఊహించినట్లే బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీలపై విమర్శలు కురిపిస్తున్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ, “గ్రేటర్ ఎన్నికల సమయంలో మజ్లీస్‌తో పొత్తులు స్నేహం లేవని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ రెండూ చేతులు కలిపి ప్రజలను మోసం చేశాయి. మజ్లీస్‌తో పొత్తులు, స్నేహం లేదని చెప్పినప్పుడు ఆ పార్టీ మద్దతు ఎందుకు తీసుకున్నారు? మజ్లీస్‌ పార్టీ టిఆర్ఎస్‌కు ఎందుకు మద్దతు ఇచ్చింది? కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల మద్య ఉన్న రహస్య అవగాహన ఇప్పుడు మరోసారి బయటపడింది. మతోన్మాద మజ్లీస్‌ పార్టీతో అంటకాగుతూ ప్రజలను మోసం చేస్తున్న టిఆర్ఎస్‌కు ప్రజలే బుద్ది చెపుతారు. టిఆర్ఎస్‌ కారు స్టీరింగ్ తమ చేతిలోనే ఉందని అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన మాట నిజమని రుజువైంది,” అని అన్నారు.      

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, “జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసమే టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు తమ మద్య పొత్తులు, దోస్తీ లేదంటూ నాటకాలు ఆడాయి. ఎన్నికలవగానే మళ్ళీ చేతులు కలిపేయి. ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే వాటికి 15 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు,” అని అన్నారు. 

బిజెపి జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డికె.అరుణ మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీల మద్య జరిగిన చీకటి  ఒప్పందం మేయర్‌, డెప్యూటీ మేయర్‌ ఎన్నికలతో బయటపడింది. తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సిఎం కేసీఆర్‌ చాలా అహంకారంతో మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు. హాలియా సభలో ఆయన మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను,” అని అన్నారు.      

ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌పై చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.