ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడం దారుణం: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఐటిశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశామని గుర్తుచేశారు. కేంద్ర మంత్రులను కూడా కలిసి ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లేఖల రూపంలో అందజేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు రద్దుచేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. 2021-2022 బడ్జెట్‌లో ఐటీఐఆర్‌కు నిధులు కేటాయించాలని గత నెలలో కేంద్రానికి లేఖ వ్రాశానని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రానికి పంపిన లేఖల కాపీలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. తాను దానికి సంబందించి డిపిఆర్‌లను కూడా ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అనుకూలమేనని బీజేపీ నేతలు గుర్తించాలని అన్నారు.