
రాజ్యసభ సభ్యుడు కెఆర్ సురేష్ రెడ్డి బుధవారం రాజ్యసభలో బడ్జెట్ చర్చలో మాట్లాడుతూ 1991 సంవత్సరంలో వచ్చిన ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డును వెంటనే ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. దక్షిణాది రాష్ట్రాలవారు సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే అనేక వ్యయప్రయాసలతో కూడినది కావున హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ సమాన దూరంలో ఉంది కావున సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం అని అన్నారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు తగినన్ని నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. నిజామాబాద్‌కు చెందిన ప్రజలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ భారత్‌కు ప్రతి సంవత్సరం 79 మిలియన్ల విదేశీ మారకద్రవ్యాన్ని పంపిస్తున్నారని అన్నారు. సరైన ఉపాధి లేకనే వారు గల్ఫ్ దేశాలబాటపట్టారని కావున నిజామాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు పరిశ్రమల స్థాపనకు రూపకల్పన చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. నిజామాబాద్‌లో పండించే పసుపు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది కాబట్టి జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని సురేష్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.