
ఖమ్మం టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనా మహమ్మారిపై పోరాటం చేశాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నగరంలో తయారవుతుండటం గర్వంగా ఉందన్నారు. డబ్బులు పెట్టి కొనే స్తోమత లేని నిరుపేదలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. మనదేశంలో ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కొత్త విమానాశ్రయాలు, 21 కొత్త నవోదయ విద్యాలయాలు, ఐఐఎం, జిల్లాలను కలుపుతూ అంతర్గత రింగ్ రోడ్లు, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం వంటివి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నాయి కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.