టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రస్థాయి మహాజన ఉద్యోగ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌ఆర్టీసీని నష్టాల బాట నుండి లాభాలబాట పట్టాలంటే ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటే మార్గమని  అన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పోయిందని అన్నారు. టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగభద్రత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పదమైన జీవోలను వెంటనే రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల 55 రోజుల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం చాలా తేలికగా తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టిందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి టీఎస్‌ఆర్టీసీ పట్ల సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. టీఎస్‌ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకూ ఉద్యమిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు.