
ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించాలనుకోవడంపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే సిఎం కేసీఆర్ షర్మిళను రప్పించారు. అందుకే ఆమె రాకను టిఆర్ఎస్ వ్యతిరేకించడం లేదు. ఓ పక్క అన్న జగన్ తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు నడిపిస్తుంటే, చెల్లి షర్మిళ తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ వస్తున్నారు. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టాలనుకొంటే ముందుగా ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పధకాలపై ఆమె వైఖరి ఏమిటో చెప్పాలి. నీళ్ళ విషయంలో ఆమె తెలంగాణ తరపున అన్నతో పోరాడుతారా? చెప్పాలి,” అని అన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “ఆమెకు అన్నతో గొడవలుంటే అక్కడే ఏపీలో తేల్చుకోవాలి కానీ ఇక్కడ తెలంగాణకు ఎందుకు రావడం?ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉందో లేదో తెలీదు. ప్రజలు దానిని ఎప్పుడో మరిచిపోయారు. మరిప్పుడు షర్మిళ ఎవరితో పార్టీ పెట్టాలనుకొంటోంది?అసలు ఆమె ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ పార్టీ పెట్టాలనుకొంటున్నారు?రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందిక్కడ. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది తప్ప బయటనుంచి వచ్చే వాళ్ళతో కాదు,” అని అన్నారు.