
రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం రేపు అంటే ఫిబ్రవరి 11న హైదరాబాద్ మేయర్, డెప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. ముందుగా రేపు ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. తరువాత 12.30 గంటలకు వారు చేతులు ఎత్తడం ద్వారా ప్రత్యక్ష పద్దతిలో మేయర్, డెప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం 150 మంది ఎన్నికవగా వారిలో లింగోజీగూడా అభ్యర్ధి ఆకస్మిక మరణంతో సభ్యుల సంఖ్య 149 అయ్యింది. ఎక్స్అఫీషియో సభ్యులు 44మండి కలిపి మొత్తం 193మంది అవుతారు. కనుక మేయర్, డెప్యూటీ మేయర్లను ఎన్నుకోవడానికి వారిలో కనీసం 97మంది తప్పనిసరిగా హాజరుకావలసి ఉంటుంది. అంతమంది ఉంటేనే కోరం ఉన్నట్లవుతుంది లేకుంటే జీహెచ్ఎంసీ నియమనిబందనల ప్రకారం ఎన్నిక నిర్వహించడానికి వీలులేదు. ఒకవేళ మొదటిరోజున కోరంలేకపోతే మరుసటిరోజున అంటే శుక్రవారం మళ్ళీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తారు. ఆరోజు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం నిర్దేశించిన రోజున పాలకమండలి సమావేశం నిర్వహించి కోరంతో సంబందం లేకుండా ఎంతమంది పాల్గొంటే అంతమందితో ప్రత్యక్ష పద్దతిలో మేయర్, డెప్యూటీ మేయర్లను ఎన్నుకొంటారు.
గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్-56, బిజెపి-48, మజ్లీస్-44, కాంగ్రెస్-2 సీట్లు గెలుచుకొన్నాయి. టిఆర్ఎస్ తరువాత బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకొన్నందున డెప్యూటీ మేయర్ పదవికి పోటీ చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ప్రకటించారు. మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికపై మజ్లీస్ పార్టీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ ప్రకటించలేదు.