
సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి పోలీసులు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డితో సహా మొత్తం 21 మందిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మొన్న ఆదివారంనాడు వారు జిల్లాలోని గుర్రంబోడు వివాదాస్పదభూముల పరిశీలనకు వెళ్లినప్పుడు వారి సమక్షంలోనే బిజెపి కార్యకర్తలు పోలీసులపై రాళ్ళతో దాడులుచేసి, అక్కడ ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన షెడ్లను ధ్వంసం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేసి గాయపరచడం, ప్రైవేట్ ఆస్తులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం, ఆ ప్రాంతంలో ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడంవంటి పలు కారణాలతో వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశామని సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన భాగ్యరెడ్డితో సహా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం ఉదయం కోదాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి రెండువారాల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు వారందరినీ నల్గొండ జైలుకు తరలించారు.