ఏపీలో కొనసాగుతున్న తొలిదశ పంచాయితీ పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. మొత్తం 4 దశలలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. నేడు తొలిదశలో విజయనగరం జిల్లా తప్ప మిగిలిన 12 జిల్లాలలో పోలింగ్ జరుగుతోంది. ఈరోజు మొత్తం 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగవలసి ఉండగా వాటిలో 525 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవాలవడంతో మిగిలిన 2,723 సర్పంచ్ పదవులకు, 20,160 వార్డు మెంబర్లను ఎన్నుకోవడానికి పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. తరువాత గెలిచిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌ను ఎన్నుకొంటారు. తొలిసారిగా ఈ పంచాయతీ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లలో నోటా ఆప్షన్ కూడా ప్రవేశపెట్టింది ఏపీ ఎన్నికల సంఘం.