అచ్చంపేటలో కాంగ్రెస్‌ రైతుభరోసా దీక్ష

మల్కాజిగిరీ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో కాంగ్రెస్‌ శ్రేణులు రైతుభరోసా దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే పంటలు ఎవరు కొంటారని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటని ప్రశ్నించారు.  రైతులకు ఎక్కువ మేలు చేసే పనులను చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి  పథకాలు తెరాస కార్యకర్తలకే వస్తున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

 పోలీసులు  ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. దీక్ష ముగింపు సమయంలో కాంగ్రెస్ నేత మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కార్యకర్తలు అచ్చంపేట నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డిని కోరారు. దానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి అచ్చంపేట నుండి హైదరాబాదుకు పాదయాత్ర చేపట్టారు. ఉప్పునూతల మండలం వచ్చేసరికి చీకటిగా ఉండడంతో అక్కడే బస చేశారు.

ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని  నియమించవలసిందిగా కేంద్రాన్ని కోరుతానని అన్నారు.