అసదుద్దీన్ ఓవైసీకి హైకోర్టులో ఊరట

మజ్లీస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐదేళ్ళ క్రితంనాటి ఓ కేసు నుంచి హైకోర్టు విముక్తి కల్పించింది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ ప్రయాణిస్తున్న కారును పురానాపూల్ వద్ద కొందరు మజ్లీస్‌ కార్యకర్తలు అడ్డుకొన్నారు. ఆ ఘటనపై షబ్బీర్ అలీ హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు అసదుద్దీన్ ఓవైసీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ ఘటనతో తనకు ఎటువంటి సంబందామూ లేదని కనుక ఆ కేసు నుంచి తనపేరును తొలగించాలని అసదుద్దీన్ ఓవైసీ దిగువ కోర్టుకు విజ్ఞప్తి చేసారు కానీ కోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించి కేసు కొనసాగించింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆ ఘటనలో అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందున ఆ కేసు విచారణను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.రాజశేఖర్ రెడ్డి శుక్రవారం మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.