
పినపాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు అటవీశాఖ అధికారులకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు. ఖమ్మం జిల్లాలోని గుండాల మండలం, శంభునిగూడెం నివశిస్తున్న ఆదివాసీలు సమీపంలోని అటవీప్రాంతంలో పోడుభూములలో వ్యవసాయం చేసుకొంటున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది వారికి ఎన్నిసార్లు నచ్చజెప్పినా, వారికదే జీవనాధారం కావడంతో పోడుభూములలో వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కనుక వారిని అడ్డుకొనేందుకు అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతం చుట్టూ కందకాలు తవ్విస్తున్నారు. దాంతో ఆదివాసీలకు వారికీ మద్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి.
ఆదివాసీలకు అండగా పినపాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు నిలబడి అటవీశాఖ అధికారులతో ఘర్షణ పడుతున్నారు. అయితే ప్రభుత్వం చీఫ్ విప్‌గా ఉన్న ఆయన ఈ సమస్యను సిఎం కేసీఆర్‌తో లేదా సంబందిత మంత్రులతో మాట్లాడి పరిష్కరించుకొనే బదులు, అటవీశాఖ అధికారులతో ఘర్షణ పడుతున్నారు. వారిని తరిమికొట్టమని ఆదివాసీలను రెచ్చగొడుతున్నారు. ఆదివాసీలతో పెట్టుకొంటే అటవీశాఖ అధికారులను విడిచిపెట్టనని బెదిరిస్తున్నారు. రాయికి రాయితోనే సమాధానం చెప్పాలని ఆదివాసీలను రెచ్చగొడుతున్నారు. ఆదివాసీలు అందరూ కుమరం భీంలాగా గర్జించాలని పిలుపునిస్తున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బందికి రక్షణగా వచ్చిన పోలీసులను, ఎస్సైలను కూడా రేగ కాంతారావు బెదిరిస్తున్నారు.
ఆదివాసీల హక్కుల కోసం నిలబడటం తప్పు కాదు కానీ ప్రభుత్వ భూములైన అటవీ భూములను, వాటిలో జంతువులు, పక్షలను కాపాడటం, పచ్చదనాన్ని పెంచడం అటవీశాఖ సిబ్బంది బాధ్యత అని మరిచిపోకూడదు. ఆ బాధ్యతలు నిర్వరిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపైకి...వారికి రక్షణగా వచ్చిన పోలీసులపైకి ఆదివాసీలను ఉసిగొల్పడం లేదా వారి విధులకు ఆటంకం కల్పించడం, వారిని దూషించడం, బెదిరించడం వంటివన్నీ చట్టరీత్యా నేరమనే సంగతి ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేస్తున్న రేగ కాంతారావుకి తెలియవనుకోలేము.
అంతేకాదు ఈ ఘర్షణలతో మొదట టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది కూడా. గతంలో ఓ అటవీశాఖ అధికారిణిపై ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కర్రతో దాడిచేసిన ఘటనను బిజెపి ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరుతూ స్పీకర్ చేత నోటీసులు పంపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక రేగ కాంతారావు ఈ సమస్యను సిఎం కేసీఆర్‌తో మాట్లాడి పరిష్కరించుకొంటే అందరికీ మంచిది కదా?