నేడు హైదరాబాద్‌ రానున్న మానిక్కం ఠాగూర్

రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల హడావుడి మొదలవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా వాటి కోసం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ మాణికం ఠాకూర్‌ ఇదే పనిమీద శనివారం సాయంత్రం హైదరాబాద్‌ రానున్నారు. రేపు ఉదయం ఖమ్మంలో వరంగల్‌, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ నేతలతో సమావేశమయ్యి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి చర్చిస్తారు. అనంతరం మిర్యాలగూడా చేరుకొని అక్కడ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, పార్టీ నేతలతో సమావేశమయ్యి నాగార్జునసాగర్ ఉపఎన్నికల గురించి చర్చిస్తారు. 

వరుస ఓటములతో డీలాపడిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన సత్తా చాటుకొనేందుకు ఈ ఎన్నికలు మరో అవకాశం కల్పించాయి కనుక టిఆర్ఎస్‌, బిజెపిల ధాటిని తట్టుకొని నిలబడగల బలమైన అభ్యర్ధులను బరిలో నిలబెట్టాల్సి ఉంటుంది. రేపు ఖమ్మంలో జరుగబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించి వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకొంటున్ననేతల జాబితాను మాణికం ఠాకూర్‌ సిద్దం చేస్తారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నేత కె.జారెడ్డి పేరు ఇదివరకే ఖరారు అయినందున ఉపఎన్నికలకు ఏర్పాట్లు, టిఆర్ఎస్‌, బిజెపిలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి మిర్యాలగూడ సమావేశంలో చర్చించనున్నారు.