మానవత్వంతో జో బైడెన్‌ నిర్ణయాలు...శభాష్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే మూడు సున్నితమైన అంశాలపై మానవతాదృక్పదంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనది ట్రంప్‌ హయంలో ‘జీరో టాలరెన్స్’ పేరుతో బలవంతంగా విడగొట్టబడిన వలస కుటుంబాలను మళ్ళీ ఏకం చేయడం. 

ట్రంప్‌ హయాంలో మెక్సికో నుంచి అమెరికాలోకి ప్రవేశించినవారిలో 5-6,000కు పైగా కుటుంబాలను బలవంతంగా విడగొట్టారు. అప్పుడు చెల్లాచెదురైపోయినవారిలో తల్లితండ్రులు, భార్యాపిల్లలు, ముక్కుపచ్చలారని చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. నేటికీ వారిజాడ తెలియని పరిస్థితి. ఆవిధంగా విడిపోయిన కుటుంబ సభ్యులను వెతికి అందరినీ మళ్ళీ కలపాలని జో బైడెన్‌ నిర్ణయించారు. దీనికోసం హోంల్యాండ్ సెక్యూరిటీ అధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై జో బైడెన్‌ మంగళవారం సంతకం చేశారు. 

ఇక రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో మెక్సికో నుంచి అంతమంది శరణార్దులు అమెరికాకు ఎందుకు వస్తున్నారు?దాని నివారణకు ఏమి చేయాలి?వచ్చిన శరణార్దులను మానవతా దృక్పదంతో ఏవిధంగా పునరావాసం కల్పించాలి?అనే అంశాలపై దీర్గకాలిక వ్యూహం రూపొందించడం, ట్రంప్‌ హయాంలో తెచ్చిన మైగ్రెంట్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ రద్దు ఉన్నాయి. 

మూడో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ అమెరికాలో స్థిరపడిన విదేశీయులకు ముఖ్యంగా ప్రవాస భారతీయులకు మేలు, ఉపశమనం కలిగించేది. ట్రంప్‌ హయాంలో వీసాల జారీ, గ్రీన్‌ కార్డ్ మంజూరు, వలస విధానాల ఆంక్షలు తదితర అని అంశాలపై పునః సమీక్ష చేయడం. అంటే త్వరలోనే ఆంక్షలు రద్దు చేసి వీసాలు, గ్రీన్‌ కార్డ్ మంజూరు ప్రక్రియను సులభతరం చేయబోతున్నట్లు భావించవచ్చు. దీంతో ట్రంప్‌ హయాంలో ముస్లిం దేశాలపై విధించిన ఆంక్షలు కూడా ఎత్తివేసి మళ్ళీ అందరికీ అమెరికా గేట్లు తెరుస్తున్నట్లే భావించవచ్చు.