సిఎం కేసీఆర్‌కు సామాన్యుల గోడు పట్టదు: కోదండరాం

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భద్రాచలం పరిధిలోని సీతానగరం, లక్ష్మీనగరం, చిన నల్లబెల్లి, చర్ల తదితర ప్రాంతాలలో పర్యటించారు. చర్లలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు సామాన్యుల గోడు పట్టదు... రాష్ట్రంలో నిరుద్యోగుల గోడు పట్టదు... రైతుల గోడు పట్టదు...ఎవరి గోడు పట్టదు....కానీ కొన్ని కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నడూ వెనకాడలేదు. గత ఆరేళ్ళుగా ఉద్యోగాల భర్తీ చేయాలని దానికి క్యాలెండర్ ప్రకటించాలని మేము కోరుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోలేకపోయారు. కొట్లాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావడం లేదు. కనుక త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు అందరూ నాకు ఓట్లు వేసి గెలిపించి సిఎం కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను మండలికి పంపించినట్లయితే ప్రజాసమస్యలపై, ముఖ్యంగా ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాను. ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి  చేస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.