సూర్యాపేటలో ప్రయోగాత్మకంగా డిజిటల్ అడ్రస్

ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో డిజిటల్ అడ్రస్ విధానంలో ఇల్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ప్లేట్లు బిగించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనిని అమలుచేయబోతున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా సూర్యాపేట పట్టణంలో దీనిని ఏర్పాటుచేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోని బండ్లగూడ 19వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ నాగుల స్రవంతి చొరవ తీసుకొని 90 ఇళ్ళకు డిజిటల్ ప్లేట్స్ బిగింపజేశారు. ఆమె సొంతఖర్చుతో వీటిని ఏర్పాటుచేయిస్తున్నారు. 

ఈ డిజిటల్ అడ్రస్ ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో ఇంటి యజమాని, చిరునామా తదితర వివరాలతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దానిని గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానం చేశారు. కనుక ఇకపై ఇంటి చిరునామా కోసం కనబడినవారినల్లా అడుగుతూ వీధులలో తిరుగనవసరం లేదు. గూగుల్ మ్యాప్‌లో ఆ క్యూర్ కోడ్ ఎంటర్ చేస్తే అక్కడికి ఎలా చేరుకోవాలో వెంటనే తెలిసిపోతుంది. మనం నగరంలో ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఏ మార్గంలో సదరు చిరునామాకు చేరుకోవచ్చో తెలిసిపోతుంది. ఈ డిజిటల్ అడ్రస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ కూడా ప్రవేశపెట్టబోతోంది. దానిద్వారా కూడా సులువుగా చిరునామాలు కనుగొనవచ్చు. సూర్యాపేటలో ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రంలో ప్రతీ ఇల్లు, వ్యాపారసంస్థ, కార్యాలయానికి ఈ డిజిటల్ అడ్రస్ ఏర్పాటు చేస్తారు.