2.jpg)
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర బిజెపికి తొలిసారిగా నిన్న వార్నింగ్ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై నిన్న బిజెపి కార్యకర్తలు దాడి చేయడంపై కేటీఆర్ స్పందిస్తూ, “ప్రజాస్వామ్యంలో ఇటువంటి భౌతికదాడులకు తావులేదు. బిజెపి నేతలు తమ వాదనలతో ప్రజలను ఒప్పించలేక ఈవిధంగా భౌతికదాడులతో చేసి భయపెట్టాలనుకొంటున్నారు. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మా పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకొనే శక్తి, బిజెపిని ఎదుర్కొనేందుకు తగినంత బలగం మాకుంది. కానీ ఓ బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాము. ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోమని ఇప్పటికే మేము బిజెపికి పలుమార్లు హెచ్చరించాము కానీ వారి ధోరణిలో మార్పు లేదని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడితో మరోసారి రుజువైంది.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బిజెపి రాజకీయ దురుదేశ్యంతోనే ఇటువంటి భౌతికదాడులతో ఆరాచానికి పాల్పడుతున్నట్లు భావిస్తున్నాము. ఇటువంటి కుట్రలను ఏవిధంగా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు. ప్రజలు కూడా బిజెపి తీరును నిశితంగా గమనిస్తున్నారు కనుక బిజెపి నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలదీయాలి. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులందరూ బిజెపి తీరును ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలలో హేతుబద్దమైన విమర్శలను ఆమోదించవచ్చు కానీ ఈవిధంగా ప్రత్యర్డులపై భౌతికదాడులు చేయాలనుకోవడం సరికాదు. రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలు కొనసాగాలని మా పార్టీ కోరుకొంటోంది,” అని అన్నారు.