వరంగల్‌లో టిఆర్ఎస్‌-బిజెపి కార్యకర్తల దాడులు

పరకాల టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై నిన్న బిజెపి కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్ళతో దాడి చేశారు.  ‘అయోధ్య రామాలయ నిర్మాణానికి చందాలు పేరుతో చందా బుక్కులతో బిజెపి కార్యకర్తలు ప్రజల నుండి డబ్బు దండుకొంటున్నారని’ ధర్మారెడ్డి విమర్శించడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హన్మకొండలోని నక్కలగుట్ట వద్ద గల ఆయన ఇంటిపై నిన్న దాడి చేశారు. సమాచారం అందుకొన్న టిఆర్ఎస్‌ కార్యకర్తలు కూడా హంటర్ రోడ్‌లో ఉన్న బిజెపి కార్యాలయం వద్దకు చేరుకొని రాళ్ళతో దాడి చేసి, అక్కడ పార్కింగ్ చేసి యూనా బిజెపి నేతల వాహనాలను ధ్వంసం చేశారు. 


ఇరువర్గాల మద్య పోరుతో ఆదివారం వరంగల్‌, హన్మకొండ అట్టుడికిపోయాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. బిజెపి కార్యకర్తలు పోలీసుల చేతుల్లోని లాఠీలు లాక్కొని వాటితోనే ధర్మారెడ్డి ఇంటివద్ద విధ్వంసం సృష్టించారు. పోలీసులు బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేసి సుబేదారీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారిపై కేసులు నమోదు చేశారు. తమ కార్యాలయంపై దాడులు చేసి విధ్వంసం సృష్టించిన టిఆర్ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్ళిన తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి సుబేదారీ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. తమ కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి 10.30 గంటల వరకు వారు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా కొనసాగించడంతో పోలీసులు ఆమెతో సహా ధర్నాలో పాల్గొన్న వారందరిపై కూడా కేసు నమోదు చేశారు.