
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్‌లో జరిగిన రాజీవ్ రైతుభరోసా యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు తెస్తానని హామీతోనే ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచారు తప్ప నిజానికి ఆయనకు అంత ఇమేజ్ లేదని అన్నారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే ఆర్మూరు సభలో ధర్మపురి అర్వింద్ తనను గెలిపిస్తే నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని లేకపోతే రాజీనామాకు కూడా వెనకాడనని స్టాంప్ పేపర్ మీద బాండు రాసిచ్చిన సంగతి గుర్తు ఉందా? అని ప్రశ్నించారు. రెండేళ్లయినా జిల్లాకు పసుపు బోర్డు తేలేదు కాబట్టి ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తారా? ప్రశ్నించారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లనే సీఎం కుమార్తె కవితను రైతులు ఓడించారని అన్నారు. ధర్మపురి అర్వింద్‌కు వచ్చే ఎన్నికలలో అదే గతి పడుతుందన్నారు.
నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెప్పించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించేది లేదని అన్నారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో అన్ని పార్టీల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అప్పుడు మాత్రమే పసుపు బోర్డు వస్తుందని అని రేవంత్ రెడ్డి అన్నారు.