శాస్త్ర సాంకేతిక రంగాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ: కేటీఆర్‌

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సీకాయ క్యాపిటల్ సంస్థ ఎండి రాజన్ ఆనందన్,  బేర్‌ఫుట్ కాలేజ్  సంచాలకుడు మేఘన్ పలోన్, యూపీఎల్ లిమిటెడ్ సీఈవో జైషాప్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో "భారత్ కొత్త సాంకేతికతకు ప్రోత్సాహం" అనే అంశంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే ఫైబర్ గ్రిడ్‌ను పనులను పూర్తిచేసి రాష్ట్రంలో గడపగడపకు ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ద్వారా వ్యవసాయం, ఆరోగ్య పరిరక్షణ, విద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయని అన్నారు.

రాబోయే రోజులలో శాస్త్ర,సాంకేతిక రంగాలలో పెనుమార్పులు రానున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వాటికి కేంద్రంగా మారనుందని అన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలకు కూడా డ్రోన్ల ద్వారా అత్యవసరమైన మందులను పంపేందుకు వీలవుతుందని తెలిపారు. అలాగే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భారీగా ఉద్యోగ కల్పనకు అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.