ముందస్తు ప్రణాళికతోనే ఢిల్లీలో పేలుడు?

దేశరాజధాని ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు కొంత పురోగతి సాధించారు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఒక చెట్టుకి సిసి కెమెరా అమర్చి ఉండటంతో ఇది ముందస్తు ప్రణాళికతోనే జరిగినట్లు గుర్తించారు. పేలుడు విధ్వంసాన్ని చిత్రీకరించేందుకు దానిని అక్కడ అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకొని దానిలో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించారు. కానీ అవి అంత స్పష్టంగా లేక పోవడంతో పరిసర ప్రాంతాలలో ఉన్న సిసి కెమెరాల రికార్డులన్నిటినీ పరిశీలించారు. వాటిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ క్యాబ్‌లో నుంచి దిగినట్లు గుర్తించారు. దాంతో పోలీసులు ఆ క్యాబ్ డ్రైవరును రప్పించి వారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను చెప్పిన వివరాలతో ఆ ఇద్దరు దుండగుల ఊహాచిత్రాలను గీయిస్తున్నారు. 

ఈ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఓ లేఖ లభించింది. దానిలో ‘ఇది ట్రెలర్ మాత్రమే’ అని వ్రాసి ఉన్నట్లు తెలుస్తోంది. కనుక ఇంకా బారీ విధ్వంసానికి ఎవరో కుట్రపన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కనుక ముందస్తుజాగ్రత్తగా కేంద్రహోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిన్న పేలుడు జరిపి పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల కోసం ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు కూడా గాలింపు మొదలుపెట్టాయి.