సింఘు వద్ద స్థానికులకు, రైతులకు మద్య ఘర్షణలు

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘు వద్ద శిబిరాలు ఏర్పాటు చేసుకొని రెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులకు, సింఘులోని స్థానికులకు మద్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణలు జరిగాయి. రైతులు ఆ ప్రాంతాన్ని ఆక్రమిమించుకొని నెలల తరబడి ఆందోళనలు కొనసాగిస్తుండటం వలన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తోందని కనుక 24 గంటలలోగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిన్న సింఘులోని స్థానిక ప్రజలు రైతులకు గడువు విధించారు. కానీ రైతులు ఖాళీ చేయకపోవడంతో స్థానికులు మొదట వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు కానీ రైతులు ససేమిర అనడంతో స్థానికులు వారిపై రాళ్ళు రువ్వుతూ గుడారాలు పీకేయడం మొదలుపెట్టారు. దాంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్ళు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు చాలా శ్రమపడవలసివచ్చింది.

ఇరువర్గాలపోరాటంలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఇప్పటివరకు రైతులకు-ప్రభుత్వానికి మద్య యుద్ధవాతావరణం ఉండేది కానీ ఇప్పుడు రైతులకు, స్థానికులకు మద్య యుద్ధవాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం సింఘు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్ళీ ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. తమ పోరాటాన్ని దొంగదెబ్బ తీసేందుకే కొంతమంది బీజేపీ నాయకులు స్థానికులను రెచ్చగొట్టి తమపై దాడులకు పురికొల్పుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.