
ఈరోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తెరాస ఎంపీలు హాజరు కావడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో జరిగిన రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలన్నీ బహిష్కరిస్తే తెరాస ఎంపీలు హాజరు కావడం దారుణమన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి తెరాస ఎంపీలు హాజరు కావడంతో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపినట్లేనని అన్నారు. సీఎం కేసీఆర్ నిజమైన రైతు పక్షపాతి అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాలను కొంతమంది బిజెపి నేతలు అపహాస్యం చేయడం దారుణమన్నారు. రైతు సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.