ఇలా అయితే ఉండలేను రాజీనామా చేస్తా: సోమారపు

తెలంగాణలో బిజెపి ఇప్పుడిప్పుడే మళ్ళీ బలపడుతుంటే పార్టీ నేతల మద్య విభేధాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇబ్బందికరంగా మారాయి. పెద్దపల్లి జిల్లాలో బిజెపి నేతల మద్య విభేధాలు ముదరడంతో జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. మాజీ ఎంపీ వివేక్ బిజెపిలో చేరినప్పటి నుండి పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని సోమారపు ఆరోపించారు. రాజకీయంగా ఆయన పార్టీకి చాలా అవసరం కనుక తాను వెనక్కుతగ్గుతున్నానని, కానీ జిల్లా అధ్యక్షుడినైనా తనకు మాటమాత్రంగా చెప్పకుండా పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండటం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో అధ్యక్ష పదవిలో కొనసాగడంలో అర్ధంలేదని, దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సోమారపు సత్యనారాయణ చెప్పారు.