ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటుకేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈకేసు అవినీతి నిరోధకశాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తుందని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీన వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

రేవంత్ రెడ్డి 2015 సం.లో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంవత్సరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేస్తున్న వేంనరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. అప్పటి నుంచి ఈ ఓటుకు నోటు కేసు కోర్టులో నలుగుతూనే ఉంది. ఈకేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబునాయుడుపై కూడా ఆరోపణలు వచ్చాయి.