నేను పార్టీ మారడం లేదు: టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ

టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తేరా చిన్నప్ప రెడ్డి త్వరలో బిజెపిలో చేరబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజెపి నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని, టిఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్న ఆయన బిజెపిలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు వాటి సారాంశం. అయితే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తాను పార్టీ మారడం లేదని చిన్నప్ప రెడ్డి స్పష్టం చేశారు. తాను బిజెపి నేతలెవరితో సంప్రదింపులు జరుపలేదని, గిట్టనివాళ్ళు ఎవరో పనిగట్టుకొని ఈ దుష్ప్రచారం చేస్తున్నట్లు భావిస్తున్నానని అన్నారు. సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో పయనిస్తోందని, రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకొంటున్నారని అన్నారు. కనుక తాను సిఎం కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌ పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానని చిన్నప్ప రెడ్డి చెప్పారు.