సౌరవ్ గంగూలీ గుండెలో మరో రెండు స్టంట్లు

భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్ళీ అస్వస్థతకు గురికావడంతో బుదవారం కోల్‌కతాలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ పరీక్షలు చేసి ఆయన గుండె రక్తనాళాలలో రెండుచోట్ల బ్లాకులు (పూడికలు) ఉన్నట్లు గుర్తించారు. గురువారం ఆయనకు రెండు స్టంట్లు వేశారు. గంగూలీ ఇదివరకు కూడా ఈ సమస్యను ఎదుర్కోగా వైద్యులు ఆయనకు అప్పుడే యాంజియోప్లాస్టీ పరీక్షలు చేసి గుండె రక్తనాళాలలో మూడు చోట్ల పూడుకుపోయాయని గుర్తించారు. కానీ వాటిలో ఎక్కువగా పూడుకుపోయిన ఒక రక్తనాళంలో మాత్రమే ఒక స్టంట్ వేసి, మిగిలిన రెండు బ్లాకులను మందుల ద్వారా కరిగించాలనుకున్నారు. కానీ మళ్ళీ సమస్య ఏర్పడటంతో ఇప్పుడు ఆ రెండు రక్తనాళాలలో కూడా స్టంట్స్ వేయకతప్పలేదు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండుమూడు రోజులలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఆసుపత్రికి వెళ్ళి గంగూలీని పరామర్శించి వచ్చారు.