ఆ పార్టీలోనూ నయీం అనుచరులు!

నరహంతకుడుగా పేరొందిన నయీం ఎన్ కౌంటర్ జరిగి ఇప్పటికి నెల రోజులుపైనే అయింది కానీ నేటికీ నయీం నేరచరిత్రకి సంబంధించి కొత్త కొత్త విషయాలు రోజుకొకటి చొప్పున బయటకి వస్తూనే ఉన్నాయి. నయీం ఎన్ కౌంటర్ (ఆగస్ట్ 9) జరిగిన వెంటనే మొట్టమొదట బయటకి వచ్చిన స్టోరీ అతనితో తెదేపాకి చెందిన ఒక మాజీ మంత్రి కుటుంబానికి, ఒక మాజీ పోలీస్ ఉన్నతాధికారికి సంబంధాలున్నాయని! ఆ ఆరోపణలని వారిద్దరూ గట్టిగా ఖండించారు. 

ఆ తరువాత వరుసగా నయీం క్రైం స్టోరీస్ వినపడటం మొదలయ్యాయి. నేటికీ ఇంకా వినబడుతూనే ఉన్నాయి. అవి దర్శకుడు రాం గోపాల్ వర్మకి చాలా స్ఫూర్తినీయడంతో ఆయన నయీంపై ఏకంగా మూడు భాగాలుగా పెద్ద సినిమా తీస్తున్నట్లు ప్రకటించేశారు. ఇంకా వినబడుతున్న నయీం క్రైం స్టోరీలతో వర్మ మరో మూడు, నాలుగు భాగాలు సినిమాలు తీసుకోవచ్చునేమోననిపిస్తోంది.

నయీం భాధితులకి అండగా నిలిచి వారి తరపున మాట్లాడుతున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టి.పి.ఎఫ్.) ఉపాధ్యక్షుడు ఎన్.రవి చందర్ తాజాగా చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు. నయీం అనుచరులు కొందరు అధికార తెరాసలో నేతలుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. దానినే రాజకీయ భాషలో చెప్పుకొన్నట్లయితే, తెరాస నేతలు కొందరు నయీం అక్రుత్యాలకి అండగా నిలిచారని చెప్పవచ్చు. యాదాద్రి భూముల విషయంలో నయీంకి వారికి మధ్య జరిగిన గొడవల కారణంగానే నయీం ఎన్ కౌంటర్ జరిగిందని ఆయన ఆరోపించారు. తెరాస నేతలే కాకుండా ప్రస్తుతం పదవులలో ఉన్న కొందరు పోలీస్ ఉన్నతాధికారులకి కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రవి చందర్ భాజపాపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ తో సంబంధం ఉన్నవారినందరినీ భాజపా మట్టుబెడుతోందని, నయీంని కూడా అందుకే ఎన్ కౌంటర్ చేయించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.  

తెలంగాణ లో మహాబూబ్ నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలలో నయీం నేర సామ్రాజ్యం విస్తరించి ఉండేదని ఆయన తెలిపారు. ఒక్క తెలంగాణ లోనే కాకుండా జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఓడిశా రాష్ట్రాలలో కొందరు రాజకీయ నేతలు నయీంని ఆయుధంగా వాడుకొనేవారని, ఆ రాష్ట్రాలలో నయీం చేతిలో సుమారు 70-100 మంది నయీం చేతిలో ప్రాణాలు కోల్పోయారని రవి చందర్ తెలిపారు.

ఈ విధంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు పోలీస్ ఉన్నతాధికారులు నయీం సేవలని ఉపయోగించుకొంటున్నందునే నయీం అంతగా రెచ్చిపోగలిగాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. నయీం వెనుక ఎవరెవరున్నారు? నయీం అకృత్యాలలో వారి పాత్ర ఏమిటి? అని తెలుసుకొనేందుకు సిఐడి దర్యాప్తు సరిపోదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కొన్నేళ్ళ క్రితం నయీం చేతిలో హత్యకి గురైన బెల్లి లలిత సోదరి సరిత మీడియాతో మాట్లాడుతూ, “మా అక్కవంటి చాలా మంది అమాయకులు నయీం చేతిలో హత్య చేయబడ్డారు. కనుక ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరిపించి నయీం బాధిత కుటుంబాలకి ఎంతో కొంత నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలి,” అని విజ్ఞప్తి చేశారు.  

ఒక సంఘవిద్రోహి చేతిలో ఇంతమంది ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని రక్షించవలసిన ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఇన్నేళ్ళుగా అతని అరాచకాలని గమనించలేదంటే నమ్మశక్యంగా లేదు. కనుక రవిచందర్ అభిప్రాయాలతో ఏకీభవించక తప్పదు. నయీం బాధితులకి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెప్పక తప్పదు.