
తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వ్యవహరిస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వేతన సవరణ సంఘం, కమిటీల పేరుతో మూడేళ్ళు దొర్లించేసి చివరికి కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడాన్ని బండి సంజయ్ తప్పు పట్టారు. ఆ మాత్రం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి మూడేళ్ళు సమయం అవసరమా? అని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్ కమిటీకి పూర్తి స్వేచ్చ ఇవ్వకుండా దానిపై ఒత్తిడి తెచ్చి తాను కోరుకొన్నట్లే నివేదిక తయారుచేయించుకొన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇంతకాలం ఉద్యోగులను మభ్య పెడుతూ కాలక్షేపం చేయడానికే బిశ్వాల్ కమిటీని వేశారని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఇప్పుడు కూడా ఫిట్‌మెంట్ పేరుతో సిఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని బండి సంజయ్ ఆక్షేపించారు.