
తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందని, త్వరలో జరుగబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వ అవినీతి అంశాన్ని లేవనెత్తుతానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఘాటుగా స్పందించారు.
బుదవారం హుజూర్‌నగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “గతంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి. అది మరిచిపోయినట్లు ఆయన ఇప్పుడు మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అనేక ఏళ్ళపాటు సమైక్య రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని అనేక పనులను సిఎం కేసీఆర్ నేతృత్వంలో మా ప్రభుత్వం కేవలం ఆరేళ్ళలోనే చేసి చూపించింది. వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, ఐటి, మౌలికవసతుల కల్పన...ఇలా ప్రతీ రంగంలోను తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో విద్యుత్, సాగు, త్రాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోయేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్, సాగు త్రాగు నీటికొరత లేకుండా చేశారు సిఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని యావత్ దేశం గుర్తించింది కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాత్రం కనిపించడం లేదు. మా ప్రభుత్వంపై పార్లమెంటులో మాట్లాడుతానని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంటున్నారు. ఇదంతా ఆయన పిసిసి అధ్యక్ష పదవిని కాపాడుకోవడానికేనని అందరికీ తెలుసు,” అని అన్నారు.