బండి సంజయ్ కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?

పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే వ్యూహాలపై మంగళవారం గాంధీభవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సిబిఐ  చేత విచారణ జరిపించాలని పార్లమెంటులో డిమాండ్ చేస్తామని అన్నారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు నిజంగా చిత్తశుద్ది ఉన్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కేంద్రానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కేంద్రప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేటాయించాలని పార్లమెంటులో గట్టిగా అడుగుతామని  అన్నారు. 

అలాగే  పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీలకు తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. అలాగే భువనగిరిలో నిధులు లేక ఎయిమ్స్ పనులు మద్యలోనే ఆగిపోయాయని  అన్నారు. కనుక 2021-22 బడ్జెట్‌లో దానికీ తగినన్ని నిధులు కేటాయించాలని అడుగుతామని  అన్నారు. మెట్రో కారిడార్‌ను సంగారెడ్డి వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. అలాగే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతర జాతీయ పండుగగా ప్రకటించాలని కోరుతామన్నారు.