కరీంనగర్‌లో టిఆర్ఎస్‌-బిజెపి కార్యకర్తలు కొట్లాట

టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తలు కరీంనగర్‌లో ఆదివారం నడిరోడ్డుపై పరస్పరం కొట్టుకొన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సిఎం కేసీఆర్‌ చేసిన తీవ్ర విమర్శలను నిరసిస్తూ టిఆర్ఎస్‌ కార్యకర్తలు బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఆదివారం ఉదయం నగరంలోని తెలంగాణచౌక్ వద్దకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బిజెపి కార్యకర్తలు అక్కడ కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నారు. 

టిఆర్ఎస్‌ కార్యకర్తలు తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి రావడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి పాల్పడ్డారు. టిఆర్ఎస్‌ కార్యకర్తలు కూడా వారిపై ఎదురుదాడి చేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగా టిఆర్ఎస్‌-బిజెపి కార్యకర్తలు కొట్టుకోవడంతో చూసి ప్రజలు దిగ్బ్రాంతి చెందారు. 

సమాచారం అందుకొన్న వన్ టౌన్ విజయ్ కుమార్, టూటౌన్ సీఐలు లక్ష్మీబాబు, తిరుమల్, ఎస్‌ఐలు శ్రీనివాస్, తిరుపతి పోలీసులను వెంటబెట్టుకొని అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. వారి తోపులాటలలో పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. చివరికి ఇరుపార్టీల కార్యకర్తలను పోలీస్ వ్యానులలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిన్న సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించారు. 

ఈ ఘర్షణలో బిజెపి కార్యకర్తలే మొదట టిఆర్ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేసినట్లు గుర్తించామని కనుక వారిపై కేసు నమోదు చేశామని వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు.