ఈటలను ముఖ్యమంత్రి చేయాలి: బండి సంజయ్‌

త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు మళ్ళీ పాట మొదలుపెట్టడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వాటిపై భిన్నంగా స్పందించారు. బుదవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడితే మొట్టమొదట దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్‌ మాట తప్పారు. మళ్ళీ ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి సిద్దమవుతున్నారు. తెలంగాణ ఉద్యమాలలో కేటీఆర్‌ పాత్ర ఏమిటి? ఉద్యమసమయంలో... మళ్ళీ కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి చేయవచ్చు కదా? ఆయన కంటే కేటీఆర్‌ ఏవిధంగా ఎక్కువ? సిఎం కావడానికి కేసీఆర్‌ కుమారుడు కావడమే అర్హతా?” అని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి మార్పు టిఆర్ఎస్‌ అంతర్గత వ్యవహారమని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ, అది రాష్ట్ర ప్రజలందరికీ సంబందించిన వ్యవహారమని కనుక దానిపై తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు అందరికీ ఉంటుందని బండి సంజయ్‌ అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో కుటుంబపాలనకు బిజెపి ముగింపు పలుకుతుందన్నారు.