రాష్ట్ర విభజన కారణంగా ఏపిలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుకొనేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని పోరాడుతోంది కానీ ప్రజలు దానిని పట్టించుకోవడం లేదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బ తింది. కారణాలు అందరికీ తెలిసినవే. జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తెరాస ప్రభుత్వమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణతో ఊపిరిపోసి నిలబెట్టింది. అప్పటి నుంచి అది మళ్ళీ తన విశ్వరూపం చూపిస్తోంది. అంటే ఏపిలో ప్రత్యేక హోదా, తెలంగాణ మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మనుగడకి చాలా ఉపయోగపడుతున్నాయన్న మాట!
రాష్ట్ర ప్రభుత్వం దాని కోసం జీవో నెంబర్:123ని జారీ చేసి హడావుడిగా భూసేకరణ చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రతిపక్షాలు చాలా లొల్లి చేశాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోర్టుకి వెళ్లి దానికి బ్రేకులు వేయగలిగాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మళ్ళీ కొత్త జీవో తీసుకువచ్చి భూసేకరణ చేపట్టింది. అంటే ప్రతిపక్షాలు పోరాడటం వలన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి న్యాయం జరిగినట్లేనని స్పష్టం అవుతోంది. ప్రభుత్వం చేపట్టే పనులకి ప్రతిపక్షాలు అడ్డుపడటం సహజమే కానీ అవి అడ్డుపడుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ఒకసారి ఆగి, లోపాలు ఏమైనా ఉన్నట్లయితే సరిచేసుకొని ముందుకు సాగినట్లయితే, ప్రతిపక్షాల విమర్శలు, కోర్టులలో మొట్టికాయలు పడకుండా తప్పించుకోవచ్చు.
కానీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మళ్ళీ అదే తప్పిదం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కోర్టులని కూడా తప్పు దారి పట్టిస్తోందని విమర్శించారు. భూసేకరణ గురించి కోర్టుకి ఒకలా చెపుతూ రైతుల నుంచి బలవంతపు భూసేకరణకి పాల్పడుతోందని ఆరోపించారు. వేముల ఘాట్ వద్ద కర్ఫ్యూ విధించవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే అక్కడ భూసేకరణని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షలు చేస్తున్న రైతులని ప్రతిపక్ష నేతలు కలవనీయకుండా ఎందుకు అడ్డుకొంటోందని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇస్తున్న ధరకి మార్కెట్ ధరకి సుమారు ఎకరానికి రూ.12లక్షలు తేడా ఉందని స్థానిక రైతులు వాదిస్తున్నారు. ప్రభుత్వం నామమాత్రపు నష్టపరిహారం ముట్టజెప్పి తమ భూములని స్వాధీనం చేసుకొంటే ఇక తాము ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకి ప్రభుత్వమే జవాబీయవలసి ఉంటుంది.
భూసేకరణ విషయంలో ఒకసారి కోర్టులో ఎదురు దెబ్బలు తిన్నప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడితే బాగుండేది. కానీ కాంగ్రెస్ నేతలు చెపుతున్నదాని ప్రకారం చూస్తే, ప్రభుత్వం మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్లుంది. ఒకవేళ వారి ఆరోపణలు నిజమనుకొంటే ప్రభుత్వానికి మళ్ళీ కోర్టులో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు. అది ప్రభుత్వానికి ఎంతమాత్రం గౌరవప్రదం కాబోదు. కనుక పంతానికి పోకుండా ప్రతిపక్షాల మాటని కాస్త చెవిన వేసుకొంటే తప్పేమీ లేదు.