
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం పురూలియా జిల్లాలో ఆమె ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భాజపా నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే మతం గుర్తుకు వస్తుందని ఆ తర్వాత మర్చిపోతారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బాజాపాలోకి ఎవరు వెళ్ళినా పార్టీకి ఎలాంటి నష్టం కలుగదని మమతా బెనర్జీ అన్నారు. భాజపా చేస్తున్న వాగ్దానాలను పశ్చిమ బెంగాల్ ప్రజలు విశ్వసించరని అన్నారు. కొంతమంది భాజపా కార్యకర్తలు వీధి రౌడీల్లాగా ప్రవర్తించి తమ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పని చేసే ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అని ఆమె అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకే శాసనసభ ఎన్నికలలో భాజపా గెలువబోతోందంటూ సర్వే నివేదికలను ప్రకటిస్తోందని అయితే వాటిని బెంగాల్ ప్రజలు నమ్మబోరని మమతా బెనర్జీ అన్నారు.
కొంతమంది భాజపా నేతలు బీదవారి ఇళ్ళలో భోజనం చేస్తున్నామని చెప్పుకొంటూ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఆహారం తెచ్చుకుని తింటున్నారని ఆమె ఆరోపించారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో గత అసెంబ్లీ ఎన్నికలలో కంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాలలో గెలవబోతోందని మమతా బెనర్జీ జోస్యం చెప్పారు.
ఈ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పశ్చిమబెంగాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.