నేడు హైదరాబాద్‌లో కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐ‌టి, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో పర్యటించి శంఖుస్థాపనలు చేస్తున్నారు. 

ముందుగా ఉదయం 9.30 గంటలకు బేగంపేటలో రూ.4.6 కోట్లు వ్యయంతో నిర్మించబోయే వైకుంఠధామం నిర్మాణపనులకు శంఖుస్థాపన చేసారు. అక్కడి నుండి ఫతేనగర్  చేరుకొని రూ.27.50 కోట్లు వ్యయంతో చేపట్టబోతున్న నాలా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేసారు. ఉదయం 10.30 గంటలకు కూకట్‌పల్లిలోని బాలాజీనగర్ చేరుకొని నాలా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేసారు. అక్కడే కోటి రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న ఇండోర్ షటిల్ కోర్టు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసారు. తరువాత జెన్‌టియూ మంజీరా షాపింగ్ మాల్‌ వద్ద రూ.48 లక్షలతో నిర్మించబోతున్న పార్కు పనులకు శంఖుస్థాపన చేసారు. కేపీహెచ్‌బీ-4 ఫేజ్‌లో రూ.1.41 కోట్లు వ్యయంతో చేపట్టబోతున్న నాలా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు అల్లాపూర్ చేరుకొని అక్కడ రూ.73 లక్షల వ్యయంతో చేపట్టబోతున్న నాలా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేస్తారు.  

గత ఏడాది ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు పొంగి ప్రవహించడంతో వరదలు కూడా సంభవించాయి. ఆ వర్షాలు, వరదలలో వేలాదిమంది నష్టపోయారు. వారిలో సుమారు 6.50 లక్షల మందికి ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం వరద సాయం అందజేయవలసి వచ్చింది. కానీ ఇంకా చాలా వేలమందికి వరద సాయం అందలేదు. హైదరాబాద్‌ నీట మునగడం, బాదిత కుటుంబాలందరికీ వరద సాయం అందకపోవడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓడిపోయింది కూడా. వరద సమయంలో మంత్రి కేటీఆర్‌ స్వయంగా నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి, మళ్ళీ ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా నగరంలోని నాలాల విస్తరణ పనులను చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ పనులకే ఇవాళ్ళ మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపనలు చేస్తున్నారు.