
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విజయ్ మాల్యా కేసుపై సోమవారం విచారణ చేపట్టింది. విజయ్ మాల్యా 2016 సంవత్సరంలో 17 బ్యాంకులకు మొత్తం రూ.9,000 కోట్లకు పైగా రుణాలు ఎగవేసి లండన్ పారిపోయినప్పటి నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసు సాగుతూనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈకేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. విజయ్ మాల్యాను భారత్ తిరిగి రప్పించేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని కానీ బ్రిటన్ చట్టాల ప్రకారం కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే ఆలస్యం అవుతోందని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. కానీ న్యాయపరమైన అన్ని చిక్కులను అదిగమించి త్వరలోనే విజయ్ మాల్యాను భారత్ తిరిగి తీసుకురావడానికి భారత్ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని తెలిపారు. ఈకేసు తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
దాదాపు నాలుగు సంవత్సరాలుగా విజయ్ మాల్యాను భారత్ తిరిగి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయినా ఇంతవరకు రప్పించలేకపోయింది. కనుక అతనిని వెనక్కు రప్పించడానికి ఇంకెన్ని ఏళ్ళు పడతాయో... చూడాలి మరి.