సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణి సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ముఖ్య ప్రకటన చేశారు. సింగరేణి సంస్థలో పనిచేసే వారందరికీ ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.333 కోట్లతో సుమారు 1,478 ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. గతంలో సింగరేణిలో పనిచేసే కొంతమందికి ఇండ్లు ఉండేవని, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. మొదటిదశలో భూపాలపల్లిలో 904, సత్తుపల్లిలో 352, సత్తుపల్లి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 130 ఇళ్ళను నిర్మించనున్నామని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి ఇవన్నీ పూర్తవుతాయని తెలిపారు. మిగతా ఇండ్లు ఈ ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తవుతాయని శ్రీధర్ తెలిపారు.

సింగరేణిలో ఉద్యోగులు, కార్మికులు అందరూ కలిపి సుమారు 45,000 మందికి పైగా ఉన్నారు. మొదటిదశలో 1,478 ఇళ్ళు మాత్రమే నిర్మించబోతున్నట్లు శ్రీధర్ తెలిపారు. ఈ లెక్కన 45,000 మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి ఎన్నేళ్ళు పడతాయో ఊహించలేము. అనేక ఏళ్ళుగా సింగరేణి లాభాలలో దూసుకుపోతోంది. కనుక ఈపని ఎప్పుడో చేసి ఉండాలి. ఎందుకంటే తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత దయనీయ జీవితాలు గడుపుతున్నారు. ఇది సింగరేణికి ఏమాత్రం గౌరవం కాబోదు.