
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఏ చంద్రశేఖర్ బిజెపిలో చేరబోతున్నారు. ఈరోజు సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరుగబోయే భారీ బహిరంగసభలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డికె.అరుణ, విజయశాంతి తదితరులు పాల్గొనబోతున్నారు. వారి సమక్షంలో చంద్రశేఖర్ కాషాయ కండువా కప్పుకొని బిజెపిలో చేరబోతున్నారు. ఆయనతో పాటు కొందరు టిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం. ఈరోజు సభకు రాష్ట్ర బిజెపిలోని హేమాహేమీలు చాలామంది హాజరవుతుండటం గమనిస్తే ఆయనకు బిజేపీ చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
డాక్టర్ ఏ చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి బిజెపీ బలపడుతుండటంతో దానిలో నేడు చేరుతున్నారు. మరి ఈ ప్రస్థానం ఎంతవరకు సాగుతుందో?